విజయనగరం: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు.
చిన్న శ్రీను రాజీనామా కేవలం ఒక పార్టీ నేత పార్టీ మారడం కంటే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. కారణం.. ఆయన బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడే కాకుండా, విజయనగరం జిల్లాలో వైసీపీ సంస్థాగత నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నేత కావడం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం వైసీపీకి ఉత్తరాంధ్రలో రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామంగా మారింది.
సెప్టెంబర్ 8న చిన్న శ్రీను వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలే ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. తనకు వివిధ హోదాలు, బాధ్యతలు కల్పించిన జగన్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది అంత సాదాసీదా రాజీనామా కాదన్న చర్చ మొదలైంది.
బొత్స–చిన్న శ్రీను మధ్య ఏం జరిగింది?
చిన్న శ్రీను రాజకీయ ఎదుగుదల మొత్తం బొత్స సత్యనారాయణతో ఉన్న అనుబంధంతో ముడిపడి ఉంది. ఆయన బొత్సకు మేనల్లుడు. వైసీపీలోనూ ఇద్దరూ కలిసి పనిచేశారు. జిల్లా స్థాయిలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో చిన్న శ్రీను కీలకంగా వ్యవహరించారు.
జగన్ పాదయాత్ర సమయంలో ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల సమన్వయంలో కూడా చిన్న శ్రీను కీలక పాత్ర పోషించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అయితే గత కొంతకాలంగా బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను మధ్య రాజకీయ విభేదాలు పెరిగాయన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా పార్టీపై పట్టు, నియోజకవర్గ బాధ్యతలు, భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్న చర్చ సాగింది. అయితే వీటిని ఇద్దరూ బహిరంగంగా ధ్రువీకరించిన దాఖలాలు లేవు. చిన్న శ్రీను మాత్రం తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలనే పేర్కొన్నారు.
జడ్పీ చైర్మన్ పదవి కూడా కీలకమే
చిన్న శ్రీను కేవలం వైసీపీ జిల్లా అధ్యక్షుడే కాదు. ఆయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రభావానికి ఈ పదవి కూడా ముఖ్యమైనది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన వైసీపీని వీడటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక్కడే మరో అంశం తెరపైకి వచ్చింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ పీఠం విషయంలో బొత్స తన కుమార్తెని కుటుంబం తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారు. చిన్న శ్రీను కూడా భవిష్యత్తులో జడ్పీ రాజకీయాల్లో తన స్థానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈ రాజీనామా.
మరి టీడీపీలోకే ఎందుకు?
వైసీపీకి రాజీనామా చేసిన కొద్దిసేపటికే చిన్న శ్రీను టీడీపీలో చేరడం ఈ వ్యవహారంలో కీలకమైన అంశం.
చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. తన కుమార్తె సిరి సహస్రతో పాటు అనుచరులతో కలిసి ఆయన టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరిన సందర్భంగా చిన్న శ్రీను చెప్పిన కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
టీడీపీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో అధికార పార్టీతో కలిసి పనిచేయడం ద్వారా జిల్లా స్థాయిలో తన రాజకీయ ప్రభావాన్ని కొనసాగించడానికి చిన్న శ్రీను ప్రయత్నిస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లాలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ద్వారా ఏర్పడిన పరిచయాలు, అనుచర వర్గం ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం టీడీపీకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.
2024 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో కీలక నేతల రాజకీయ భవిష్యత్తుపై సహజంగానే చర్చ జరుగుతోంది. చిన్న శ్రీను తన తదుపరి రాజకీయ ప్రయాణాన్ని అధికార కూటమితో కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన టీడీపీలో చేరిక ద్వారా స్పష్టమైంది.
వైసీపీకి నష్టం ఎంత?
విజయనగరం జిల్లాలో వైసీపీకి చిన్న శ్రీను ఒక సాధారణ కార్యకర్త కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ సంస్థాగత వ్యవహారాలను నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేశారు. అంతేకాకుండా బొత్స కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన పార్టీ మారడం ప్రతీకాత్మకంగా కూడా పెద్ద దెబ్బగా వైసీపీకి కనిపించవచ్చు.
బొత్స కుటుంబం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చాలా కాలంగా ప్రభావం కలిగిన కుటుంబం. అలాంటి కుటుంబానికి చెందిన కీలక వ్యక్తి ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడం రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామం.
Don’t receive OTP? Resend