జపాన్ వేదికగా మరికొద్ది వారాల్లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. మ్యాచ్లు నిర్వహించ తలపెట్టిన కరోగీ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో పిచ్ నాణ్యత అత్యంత నాసిరకంగా ఉందని, కనీస సౌకర్యాలు కూడా లేవని క్రికెట్ బోర్డుల ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం కనీసం 2 వేల మంది ప్రేక్షకులు వీక్షించేందుకు తగిన వసతులు ఉండాలి. అయితే జపాన్ ఎంపిక చేసిన వేదిక నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో పాటు సరైన డ్రెస్సింగ్ రూమ్లు కూడా అందుబాటులో లేవని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. గత మే నెలలో జరిగిన చిన్న టోర్నీ మినహా ఇక్కడ ఎలాంటి మ్యాచ్లు జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు ఆటగాళ్ల వసతి ఏర్పాట్లపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్లు జరిగే మైదానానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఆటగాళ్లకు బస కేటాయించారు. ఫుట్బాల్, సాఫ్ట్బాల్ క్రీడాకారులతో కలిపి చిన్న గదుల్లో వసతి కల్పించడంతో ఇద్దరు ఆటగాళ్ల కిట్లు పెట్టుకోవడానికి కూడా స్థలం సరిపోవడం లేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ సమస్యలపై భారత ఒలింపిక్ అసోసియేషన్, ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీతో బీసీసీఐ ఇప్పటికే చర్చలు జరిపింది. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు భారత్, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్లతో కూడిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధుల బృందం త్వరలోనే జపాన్లో పర్యటించనుంది.
Don’t receive OTP? Resend