భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రతినిధి దేవజిత్ సైకియా ప్రశంసల వర్షం కురిపించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తరహాలోనే అద్భుతమైన, సుదీర్ఘమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సైకియా, వైభవ్ ప్రతిభపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సచిన్ సాధించిన విజయాలే ఆదర్శం
వైభవ్ కేవలం ఒకటి రెండు సిరీస్‌లకే పరిమితమయ్యే వండర్ ప్లేయర్‌గా మిగిలిపోకూడదని దేవజిత్ సైకియా హితవు పలికారు. కేవలం పదిహేనేళ్ల వయసులోనే ఒక అసాధారణ ఆటగాడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడం పట్ల బీసీసీఐ ఎంతో గర్వపడుతోందని ఆయన తెలిపారు. వైభవ్ తన సత్తా ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడని ప్రశంసించారు.
భవిష్యత్తులో కూడా సరైన మార్గంలో పయనిస్తూ సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నారు. అందుకోసం సచిన్ తెందుల్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వైభవ్ కెరీర్లో వేసే ప్రతి అడుగును బోర్డు నిశితంగా గమనిస్తుందని, అతని భవిష్యత్తు ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
సఫారీలతో వన్డే సిరీస్ ప్రతిపాదన
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ముంగిట సఫారీ జట్టుతో తలపడితే బాగుంటుందని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగు నుంచి ఆరు వన్డే మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ రివ్యూ మీటింగ్‌లో భారత ఆటగాళ్ల ఫిట్నెస్ అంశంపై కూడా బోర్డు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
Don’t receive OTP? Resend