అమరావతి: స్క్రబ్బర్ల ప్యాకింగ్, వ్యాపారం పేరుతో భారీగా డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఎండీ పసుపులేటి అంకుశం రాజా కోర్టులో లొంగిపోయాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు రూ.30 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చేతులెత్తేసిన వ్యవహారంలో విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అంకుశం రాజా పరారీలో ఉన్నాడు. బుధవారం విజయవాడలోని మూడో ఏజేఎంఎఫ్‌సీ కోర్టుకు న్యాయవాదితో కలిసి వచ్చి లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశాడు.
అయితే కేసులో డిపాజిటర్స్ చట్టంలోని సెక్షన్‌ను కూడా చేర్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆ సెక్షన్ కింద నమోదైన కేసులను ఎంఎస్‌జే కోర్టు విచారిస్తుందని మూడో ఏజేఎంఎఫ్‌సీ కోర్టు స్పష్టం చేసింది. అక్కడే లొంగుబాటు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
ఎంఎస్‌జే కోర్టులో వాదనలు
దిగువ కోర్టు సూచన మేరకు అంకుశం రాజా ఎంఎస్‌జే కోర్టును ఆశ్రయించాడు. లొంగుబాటు పిటిషన్‌ను అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. అయితే నిందితుడు పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేశాడని, కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఏపీపీ వాదించారు. నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించి విచారణ జరిపే అవకాశం కల్పించాలని కోరారు.
తనను పోలీసులు ఇబ్బందులకు గురిచేశారని, తన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారని అంకుశం రాజా కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
భార్య కూడా అరెస్టు
ఇదే కేసులో అంకుశం రాజా భార్య సుష్మను కూడా సత్యనారాయణపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆమె కారులో విజయవాడకు వస్తుండగా పోలీసులు కదలికలను ట్రాక్ చేశారు. ఆమె నగరంలోకి ప్రవేశించిన విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఆమె కారులో నుంచి రూ.5 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు, బ్యాంకు కౌంటర్ ఫాయిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంకుశం రాజా నుంచి సుష్మ ఖాతాలకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు.
విజయవాడలోని సంస్థ కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న గోదాముల నిర్వహణను సుష్మ పర్యవేక్షించేదని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసులో ఆమె పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. సుష్మను గురువారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో భారీగా డిపాజిట్లు
వంట పాత్రలు తోమేందుకు ఉపయోగించే స్క్రబ్బర్ల ప్యాకింగ్, విక్రయ వ్యాపారం పేరుతో ఈ సంస్థ డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పెట్టుబడి పెడితే వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని, ఆదాయం వస్తుందని నమ్మించి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, హైదరాబాద్, షాద్‌నగర్, రాజమహేంద్రవరం, విజయవాడ, భీమవరం, ఏలూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని ప్రాంతాల్లోనూ బాధితులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం బయటపడిన కేసుల ఆధారంగా సుమారు రూ.30 కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఎంత మొత్తం వసూలు చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, డబ్బు ఎక్కడికి మళ్లించారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
11 మందితో సిట్ ఏర్పాటు
కేసు తీవ్రత దృష్ట్యా విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో 11 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. నార్త్ ఏసీపీ సత్యానందంను కేసు దర్యాప్తు అధికారిగా నియమించారు.
డిపాజిట్ల రూపంలో సేకరించిన మొత్తాల వివరాలు, నిందితుల బ్యాంకు ఖాతాలు, సంస్థకు సంబంధించిన ఆస్తులు, కార్యాలయాలు, గోదాములు, పెట్టుబడిదారుల వివరాలను సిట్ పరిశీలిస్తోంది. ఇతర వ్యక్తులు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారా? సేకరించిన డబ్బును ఎక్కడికి మళ్లించారు? అనే కోణాల్లోనూ దర్యాప్తు సాగుతోంది.
కాగా, అంకుశం రాజా లొంగిపోవడం, ఆయన భార్య అరెస్టుతో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది. ఇప్పటికే డిపాజిట్లు చెల్లించిన బాధితుల నుంచి ఫిర్యాదులు, ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Don’t receive OTP? Resend