అమరావతి: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌పై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. తనపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధ కలిగించాయని, తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనే అసలు వాస్తవాలను వివరించానని చెప్పారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ పోలీసులకు అందజేశానని, సమయం వచ్చినప్పుడు ఒక్కో ఆధారాన్ని బయటపెడతానని తెలిపారు.
తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేఘన మాట్లాడుతూ.. జోగి రమేష్, ఆయన భార్యను తాను సొంత తల్లిదండ్రులుగా భావించానని చెప్పారు. అయితే తన భర్తతో ఉన్న సమస్యను పరిష్కరించకుండా వివాదాన్ని మరింత పెంచారని ఆరోపించారు.
తన పుట్టింటి వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని మేఘన స్పష్టం చేశారు. పెళ్లికి ముందు తన అత్తింటివారు హిందువులమని చెప్పారని, పెళ్లయిన తర్వాత వారు క్రైస్తవులని తెలిసిందని చెప్పారు. ఇంట్లో హిందూ పూజలు జరిగేవి కావని, జోగి రమేష్ ఇంట్లో పూజ గది కూడా లేదని ఆరోపించారు.
‘క్రైస్తవం పాటించడం తప్పు కాదు.. దాచిపెట్టి పెళ్లి చేయడమే తప్పు’
క్రైస్తవ మతాన్ని పాటించడం తప్పు కాదని, అయితే ఆ విషయాన్ని తనకు ముందుగా చెప్పకుండా దాచి పెట్టి పెళ్లి చేయడం తప్పని మేఘన అన్నారు. అత్తింట్లో బైబిల్ చదివినా తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. అయితే తన అత్తగారు హిందూ దేవుళ్లపై అభ్యంతరకరంగా మాట్లాడేవారని ఆరోపించారు.
పెళ్లయిన నెలకే ఆషాఢం వచ్చిందని, అదనపు కట్నం తీసుకొస్తేనే తాను సంతోషంగా ఉంటానని తన అత్త చెప్పేవారని మేఘన ఆరోపించారు. తన అత్తింటివారు తనకు పెట్టింది గోరుముద్దలు కాదని, ‘విషముద్దలు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన భర్తకు ఉన్న సమస్య ఏంటో తెలిసినప్పటికీ తన అత్తగారు పెళ్లి చేశారని మేఘన ఆరోపించారు. పెళ్లయిన రెండు నెలలకే తన భర్త రాజీవ్ తనపై ‘నల్ అండ్ వాయిడ్’ కేసు వేశారని చెప్పారు. విడాకుల కోసం రాజీవ్ ఎందుకు వెళ్లాడనే విషయం తనకు చాలా ఆలస్యంగా తెలిసిందన్నారు.
తనను వదిలించుకునేందుకు అనేక కట్టుకథలు చెప్పారని మేఘన ఆరోపించారు. కుమారుడికి చికిత్స చేయించాల్సి ఉందని చెప్పి తనను పుట్టింటికి వెళ్లమన్నారని, చికిత్స జరుగుతోందన్న కారణంతో తాను అత్తింటికి అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వెళ్లేదానినని తెలిపారు.
‘వసంత కృష్ణ ప్రసాద్‌ను న్యాయం కోసం కలిశా’
తనకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను కలిసిన విషయం వాస్తవమేనని మేఘన చెప్పారు. తాము పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లామని తెలిపారు. అయితే కేసు పెట్టవద్దని తమ లాయర్‌తో మధ్యవర్తిత్వం జరిపారని ఆరోపించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమస్యను సెటిల్ చేసుకోవాలని సూచించారని మేఘన తెలిపారు. సజ్జల తనతో మాట్లాడి ‘నేనున్నాను.. న్యాయం చేస్తాను’ అని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడమే జోగి రమేష్ వైపు నుంచి జరిగిందని ఆరోపించారు.
వైఎస్ జగన్‌ను కూడా కలిసేందుకు ప్రయత్నించామని, అయితే అది సాధ్యం కాలేదని మేఘన తెలిపారు.
‘ఎఫ్ఐఆర్లోని ప్రతి ఆరోపణకు ఆధారాలున్నాయి’
తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని మేఘన స్పష్టం చేశారు. ఇప్పటికే తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేశానని, సరైన సమయం వచ్చినప్పుడు వాటన్నింటినీ ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు.
జోగి రమేష్ తనపై చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్న మేఘన.. అసలు వాస్తవాలు ఏమిటో తాను ఎఫ్ఐఆర్లోనే పొందుపరిచానని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Don’t receive OTP? Resend