నేపాల్ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యాత్రికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్‌బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో ముగ్గురి ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
అదే సమయంలో మానససరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన యాత్రికులు సురక్షితంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులందరినీ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
నేపాల్‌లో ఉన్న ఏపీ యాత్రికుల పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) అధికారులు అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయానికి ఇప్పటికే అందించారని మంత్రి తెలిపారు. విదేశాంగ శాఖ సాయంతో యాత్రికులను త్వరితగతిన రప్పించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించారు.
నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల భద్రత, వారిని క్షేమంగా రప్పించే ప్రక్రియను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బాధితుల కుటుంబసభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Don’t receive OTP? Resend