ఆగ్రా డివిజన్‌కు చెందిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ శ్యామ్ సింగ్‌కు ఆల్కహాల్ బ్రీతలైజర్ పరీక్షలో ఒక వింత అనుభవం ఎదురైంది. ఆయన ఏకంగా 550 మిల్లీగ్రాముల మోతాదులో మద్యం సేవించినట్లు పరీక్షల్లో రీడింగ్ చూపించింది.
ఇంతటి భారీ మోతాదు చూపించడంతో ఉన్నతాధికారులు ఆయన్ను ఆ రోజు విధులకు దూరంగా ఉంచారు. అయితే, సదరు బ్రీతలైజర్ యంత్రంలో ఉన్న సాంకేతిక లోపం వల్లే ఈ విధంగా తప్పుడు రీడింగ్ చూపించిందని లోకో పైలట్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగిందంటే
ఆగ్రా రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ శ్యామ్ సింగ్ ఇటీవల ఆగ్రా కంటోన్మెంట్ నుంచి కాన్పూర్ వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపించారు. సాధారణంగా లోకోపైలట్లకు విధుల్లోకి వెళ్లే ముందు, విధులు ముగిసిన తర్వాత రైల్వే అధికారులు ఆల్కహాల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే శ్యామ్ సింగ్‌కు విధులు ముగిసిన అనంతరం ఆల్కహాల్ పరీక్ష నిర్వహించగా తొలుత నెగెటివ్‌గా వచ్చింది.
దాంతో ఆయన విశ్రాంతి గదికి వెళ్లిపోయారు. అయితే, సుమారు 45 నిమిషాల తర్వాత అక్కడకు వచ్చిన లోకో ఇన్స్పెక్టర్, శ్యామ్ సింగ్ మద్యం పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బ్రీతలైజర్లో 550 మి.గ్రా/100 మి.లీ మోతాదులో మద్యం సేవించినట్లు రీడింగ్ చూపించిందని వెల్లడించారు. దీనిని నిర్ధారించేందుకు రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
సాంకేతిక లోపమేనని వాదన
లోకో ఇన్స్పెక్టర్ వాదనను శ్యామ్ సింగ్‌తో పాటు ఆయన సహచర లోకోపైలట్లు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రక్త పరీక్ష నివేదికను తనకు అందజేయకపోవడాన్ని శ్యామ్ సింగ్ తప్పుపట్టారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే లోకో ఇన్స్పెక్టర్ తనపై తప్పుడు కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు సంబంధించిన పరీక్ష ప్రక్రియ అంతా జరిగిన చోట ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని, తనపై కుట్ర చేసిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు రాసిన లేఖలో కోరారు.
ఇదిలాఉండగా, బ్రీతలైజర్లో చూపించిన 550 మిల్లీగ్రాముల మోతాదు అనేది అత్యంత అసాధారణమైనదని, అంతటి స్థాయిలో శరీరంలో ఆల్కహాల్ ఉండటం ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రీతలైజర్ పరికరంలో సాంకేతిక లోపం ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రైల్వే వర్గాల్లో చర్చ సాగుతోంది.
Don’t receive OTP? Resend