ఓపెన్ఏఐ సీటీఓగా తెలుగు టెకీ ఉదయ్ రుద్దర్రాజు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివి, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన తెలుగు సాంకేతిక నిపుణుడు ఉదయ్ రుద్దర్రాజు ప్రపంచ ప్రఖ్యాత కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఓపెన్ఏఐలో కీలక బాధ్యతలు చేపట్టారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ హెడ్‌గా పనిచేసిన ఆయన, ఏడాది క్రితం ఓపెన్ఏఐలో చేరి ఇప్పుడు కంప్యూట్ విభాగం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా పదోన్నతి పొందారు.
ఈ విషయాన్ని ఉదయ్ తన లింక్డ్ఇన్ పోస్టు ద్వారా వెల్లడించారు. "ఓపెన్ఏఐ కంప్యూట్ బృందం జీపీటీ-5.6 వంటి అత్యాధునిక ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన మెషీన్ లెర్నింగ్ మౌలిక సదుపాయాలపై పనిచేస్తోంది. అత్యంత వేగంగా, విశ్వసనీయంగా కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించడమే మా లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూట్ ఫుట్‌ప్రింట్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ సంస్థలో కంప్యూట్ విభాగం అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. కొత్త ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, భారీ స్థాయి కంప్యూటింగ్ వనరులను నిర్వహించడం, వినియోగదారులకు నిరంతరాయ సేవలు అందించడం వంటి బాధ్యతలను ఈ విభాగం నిర్వహిస్తుంది.
హైదరాబాద్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు
లింక్డ్ఇన్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఉదయ్ రుద్దర్రాజు హైదరాబాద్‌లోని సీబీఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో ఇంటర్న్‌షిప్ అవకాశం దక్కించుకున్నారు. అనంతరం అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
2012 నుంచి 2018 వరకు ఈబేలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన, అనంతరం రాబిన్‌హుడ్‌లో సాంకేతిక నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2024లో ఎలాన్ మస్క్ స్థాపించిన ఎక్స్ఏఐలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ హెడ్‌గా చేరి ఏడాది పాటు పనిచేశారు. 2025 జులైలో ఓపెన్ఏఐలో సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్‌గా చేరిన ఆయన, ఏడాది వ్యవధిలోనే కంప్యూట్ విభాగం సీటీఓగా పదోన్నతి పొందడం విశేషం.
Login
Comments (0)