న్యూఢిల్లీ: నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని కూడా ఆయన కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం ఎదుట జరిగిన నిరసన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించాలని ఉదయం లోక్సభ స్పీకర్ను కోరినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం చర్చకు ఆసక్తి చూపకపోవడంతోనే ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నా చేపట్టినట్లు చెప్పారు.
దేశంలో విద్యా వ్యవస్థ ఎందుకు సంక్షోభంలో పడిందని, ప్రశ్నపత్రాల లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయని, విద్య ఎందుకు ఖరీదుగా మారిందని, పిల్లలను చదివించేందుకు కుటుంబాలు ఎందుకు ఆర్థికంగా కుదేలవుతున్నాయని రాహుల్ ప్రశ్నించారు. ఇవన్నీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగుతున్న సహజమైన ప్రశ్నలేనని అన్నారు.
విద్యార్థుల డిమాండ్లను వివరిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామాలతో పాటు విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై లోక్సభ, రాజ్యసభల్లో సమగ్ర చర్చ జరగాలని మొత్తం ప్రతిపక్షం కోరుతోందని తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, పరీక్షల నిర్వహణ, విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నివాసం వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కుడి కాలుకు ఉన్న షూ ఊడిపోయింది. అనంతరం విడుదలైన వీడియోలో ఆయన ఒక్క షూతోనే మీడియాతో మాట్లాడడం కనిపించింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యం విస్తృతంగా చర్చనీయాంశమైంది.
Don’t receive OTP? Resend