చంద్రబాబు కేసులు: సీజ్ చేసిన వస్తువులు తిరిగి ఇవ్వొద్దంటూ పిటిషన్
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలపై నమోదైన పలు కేసులు ప్రస్తుతం మూసివేత దశకు చేరుకున్న నేపథ్యంలో, ఆ కేసులకు సంబంధించిన స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాల అంశం హైకోర్టు ముందుకు వచ్చింది.
పాత్రికేయుడు కె. బాలగంగాధర తిలక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు, ఇతరులపై నమోదైన కేసుల దర్యాప్తులో సీఐడీ స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను వాటిని స్వాధీనం చేసుకున్న వ్యక్తులకు తిరిగి ఇవ్వకుండా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం, గతంలో నమోదు చేసిన పలు కేసులను మూసివేయాలని కోరుతూ సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసింది. వాటిని పరిశీలించిన కోర్టు ఆయా కేసులను మూసివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.
నేపథ్యం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు, మాజీ అధికారులు తదితరులపై సీఐడీ అనేక కేసులు నమోదు చేసింది. వీటిలో కొన్ని కేసులు రాజకీయ వివాదాలకు కేంద్రబిందువయ్యాయి. అధికార మార్పు అనంతరం దర్యాప్తును సమీక్షించిన సీఐడీ, పలు కేసుల్లో క్లోజర్ రిపోర్టులు దాఖలు చేయగా, ప్రస్తుతం వాటిలో చాలావరకు కోర్టులు మూసివేశాయి.
ఈ పరిణామాల మధ్య, ఆ కేసుల దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాల భవితవ్యంపై ఇప్పుడు న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది.
కాగా, ఇదే అంశంపై కె. బాలగంగాధర తిలక్ 2024లో కూడా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు తదితరులపై సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఆ పిటిషన్లో కోరారు.
Login
Comments (0)