లక్ష కోట్ల ఆస్తి వివాదంలో జస్టిస్ నాగేశ్వరరావు మధ్యవర్తి
దిల్లీ: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటైన కల్యాణి కుటుంబంలో కొనసాగుతున్న వేల కోట్ల రూపాయల ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఫోర్జ్ ఛైర్మన్ బాబా కల్యాణి, ఆయన సోదరి సుగంధ హీరేమఠ్ మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నాగేశ్వరరావును మధ్యవర్తిగా నియమించింది. ఇరు పక్షాలతో చర్చించి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఆయనకు బాధ్యత అప్పగించింది.
ఈ వివాదానికి మూలం 1994లో బాబా కల్యాణి, ఆయన తండ్రి నీలకంఠ్ అన్నప్ప కల్యాణి మధ్య జరిగిన కుటుంబ ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం రసాయన రంగ సంస్థ హికల్ లిమిటెడ్‌లోని మెజారిటీ వాటాలను తమ కుటుంబానికి బదిలీ చేయాలని సుగంధ హీరేమఠ్ వర్గం కోరుతోంది. ప్రస్తుతం హీరేమఠ్ కుటుంబానికి 34.84 శాతం, కల్యాణి గ్రూప్‌కు చెందిన సంస్థలకు కలిపి 34.01 శాతం వాటాలు ఉన్నాయి. అయితే 1994 ఒప్పందం ప్రకారం మొత్తం 68.85 శాతం వాటాలు తమకే చెందాలని హీరేమఠ్ కుటుంబం వాదిస్తోంది.
మరోవైపు, కుటుంబ సమావేశం అనంతరం తండ్రి రాసిన లిఖితపూర్వక నోట్‌కు చట్టబద్ధత లేదని బాబా కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు, పుణె జిల్లా కోర్టు పరిధిలో జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఫలించకపోవడంతో బాంబే హైకోర్టు కూడా మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించింది. అనంతరం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ ఎల్. నాగేశ్వరరావును మధ్యవర్తిగా నియమిస్తూ, బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంబంధిత విచారణను రెండు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో దేశ కార్పొరేట్ రంగంలో ఆసక్తికరంగా మారిన ఈ కుటుంబ వివాదం చర్చల ద్వారా పరిష్కారమవుతుందా అనే అంశంపై దృష్టి నెలకొంది.
Login
Comments (0)