హైదరాబాద్: ఖాజాగూడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. హిట్ అండ్ రన్‌గా నమోదైన ఈ కేసులో సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని కూడా గుర్తించారు.
రాయదుర్గం ఇన్స్పెక్టర్ భూపతి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు **బిహార్‌కు చెందిన నందకిషోర్ (31)**గా గుర్తించారు. ఆయన రాయదుర్గంలోని ఓ హోటల్లో కిచెన్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి స్నేహితుడిని కలిసిన నందకిషోర్.. అనంతరం తెల్లవారుజామున నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. జైద్ షా, మరో వ్యక్తి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. వేగంగా వచ్చిన రెండు కార్లు నందకిషోర్‌ను ఢీకొన్నాయి. అనంతరం ఆ కార్లు ఆపకుండా వెళ్లిపోయాయి. తీవ్ర గాయాలతో నందకిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సీసీ కెమెరాలతో గాలింపు
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాలను గుర్తించేందుకు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఖాజాగూడ నుంచి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నందకిషోర్‌ను సందీప్ నడుపుతున్న కారు ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మంగళవారం సందీప్‌ను అరెస్టు చేశారు.
అదే సమయంలో మరో కారును నడిపిన శౌర్య అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్, శౌర్య ఇద్దరూ స్నేహితులని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రెండు వాహనాల పాత్ర, ఘటన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తీరుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Don’t receive OTP? Resend