కేంద్రం హామీలతో సీజేపీ ఆందోళన విరమణ
దిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు తమ ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ప్రధాన్ రాజీనామా అనంతరం సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో మరోసారి చర్చలు జరిపారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ, నీట్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిన విద్యార్థులు, కార్యకర్తలపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేవలం దిల్లీలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులనూ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల్లో కేసుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని, భవిష్యత్తులో నిరసనకారులను కేసులతో వేధించబోమని స్పష్టం చేసిందని సీజేపీ వెల్లడించింది. అలాగే నీట్ లీక్ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు, ప్రవేశ పరీక్షల నిర్వహణతో పాటు దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని తెలిపింది.
కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, దిల్లీతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల్లో నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. విద్యా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ హామీల నేపథ్యంలో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. దేశం నలుమూలల నుంచి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది.
Login
Comments (0)