సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అనుమతి లేకుండా పిటిషన్ ఉపసంహరించిన న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశం
విజయవాడ: గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన సీబీఐ దర్యాప్తు పిటిషన్‌ను ఆమె అనుమతి లేకుండానే ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఈ వ్యవహారంపై అడ్వకేట్ కోగంటి రిత్వికకు నోటీసులు జారీ చేయాలని విజయలక్ష్మి తరఫు న్యాయవాది గుడివాక వాసుదేవుడిని హైకోర్టు ఆదేశించింది.
న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చి. పురుషోత్తం కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ను విచారించింది.
విచారణ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది గుడివాక వాసుదేవుడు కీలక వాదనలు వినిపించారు. సాయికృష్ణ కస్టడీ మరణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ (ఐఏ)ను తన క్లయింట్‌కు తెలియకుండా ఉపసంహరించుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అడ్వకేట్ కోగంటి రిత్విక దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ ఉపసంహరణ జరిగిందని పేర్కొన్నారు.
తన క్లయింట్ విజయలక్ష్మి తనకే వకాలత్ ఇచ్చి కేసు వాదించేందుకు అధికారమిచ్చిందని, అయితే కోగంటి రిత్విక ఇప్పటివరకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (ఎన్వోసీ) ఇవ్వలేదని, కేసుకు సంబంధించిన రికార్డులను కూడా అప్పగించలేదని వాసుదేవుడు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ అంశాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సంబంధిత న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
నేపథ్యం
గాదె సాయికృష్ణ కస్టడీ మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలంటూ ఆయన తల్లి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరారు. అయితే తర్వాత విచారణలో తాను సిబిఐ విచారణ కోరలేదని విజయలక్ష్మి చెప్పినట్టుగా కోర్టుకి సమాచారం ఇచ్చారు. తాజాగా, ఆమెకి తెలియకుండానే ఈ పరిణామం జరిగిందని వెల్లడి కావటంతో కేసు మరో మలుపు తిరిగింది.
Don’t receive OTP? Resend