వివేకా కేసులో సునీతా రెడ్డి పిటిషన్ను కొట్టివేసిన సీబీఐ కోర్టు
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్లోని ప్రత్యేక సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే సమగ్ర దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ కోర్టుకు తెలియజేయగా, ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సునీత పిటిషన్ను డిస్మిస్ చేసింది.
ఫోన్ కాల్ డేటాపై సునీత అభ్యంతరాలు
వివేకా హత్య కేసులో కొన్ని కీలక అంశాలను సీబీఐ విస్మరించిందని సునీత చాలాకాలంగా వాదిస్తున్నారు. ముఖ్యంగా హత్య జరిగిన అనంతరం అర్థరాత్రి సమయంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, సందేశాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలపై మరింత లోతుగా దర్యాప్తు జరగలేదని ఆమె ప్రత్యేక సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
2025 డిసెంబర్లో సునీత అభ్యర్థనను పాక్షికంగా అంగీకరించిన ప్రత్యేక సీబీఐ కోర్టు, ఆ ఫోన్ కాల్ డేటా, సందేశాలపై అదనపు దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
సీబీఐ వివరణ ఇదే
కోర్టు ఆదేశాల మేరకు మరోసారి దర్యాప్తు చేపట్టిన సీబీఐ, సంబంధిత వ్యక్తులను విచారించి సాంకేతిక విశ్లేషణ నిర్వహించింది. అనంతరం 2026 మార్చిలో కోర్టుకు సమర్పించిన అదనపు నివేదికలో, అనుమానాస్పదంగా భావించిన సందేశాలు వాస్తవానికి అర్థరాత్రి పంపినవి కాదని తెలిపింది.
కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC), భారత కాలమానం (IST) మధ్య సమయ వ్యత్యాసాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అవి అర్థరాత్రి పంపిన సందేశాలుగా కనిపించాయని, అదనపు కుట్రకు సంబంధించి ఎలాంటి కొత్త ఆధారాలు లభించలేదని సీబీఐ నివేదించింది.
సమగ్ర దర్యాప్తు పూర్తయిందన్న సీబీఐ
తాజాగా విచారణ సందర్భంగా కూడా కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తయిందని, మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ వాదనలను పరిశీలించిన ప్రత్యేక సీబీఐ కోర్టు, తదుపరి దర్యాప్తు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.
కేసు నేపథ్యం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా ప్రచారం జరిగినప్పటికీ, అనంతరం అది హత్యగా తేలింది. కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది.
ఈ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సహా పలువురిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. కేసు ప్రస్తుతం ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ దశలో కొనసాగుతోంది. ఇదే సమయంలో దర్యాప్తు పూర్తి కాలేదని సునీత పలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అదనపు విచారణ కోరారు.
ఇందుకోసం ఆమె సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు, సిబిఐ కోర్టులను పలుమార్లు ఆశ్రయించారు. అయితే చివరకు, ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని సిబిఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
Login
Comments (0)