పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాలో అంతరాయాలు ఏర్పడటంతో దేశంలో సీఎన్జీ, విమాన ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో పరిస్థితులకు అనుగుణంగా చమురు సంస్థలు ఈ ధరలను సవరించాయి.
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ ధరను కేజీకి రూ.రెండు చొప్పున పెంచడంతో ముంబయి మరియు పరిసర ప్రాంతాల్లో కేజీ గ్యాస్ ధర రూ.88కి ఎగబాకింది. డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ ధర స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు ఒక రూపాయి చొప్పున పెరిగింది. దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కూడా ఇటీవల ధరలు పెంచిన విషయం తెలిసిందే. సీఎన్జీ ధరల పెరుగుదల వల్ల ఆటో, ట్యాక్సీ సంఘాలు ఛార్జీల పెంపునకు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర లీటర్‌కు రూ.6.28 అనగా 5.46 శాతం మేర పెరిగింది. దీంతో లీటర్ ధర రూ.115 నుంచి రూ.121.28కి చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. వరుసగా రెండో నెలలో ఏటీఎఫ్ ధరలు పెరగడం దేశీయ విమానయాన సంస్థలకు భారంగా మారనుండటంతో ఆ ప్రభావం ప్రయాణికులపై పడనుంది. అలాగే దేశవ్యాప్తంగా 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.9.50 నుంచి రూ.11.50 వరకు పెరిగింది.
Don’t receive OTP? Resend