అమరావతి: వైకాపా నేత, మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీకాకుళం జిల్లాలో రూ.4 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాల ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.
శ్రీకాకుళానికి చెందిన కట్టా జయకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని కుటుంబ సభ్యులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం జస్టిస్ డాక్టర్ వై. లక్ష్మణరావు విచారణ చేపట్టారు.
విచారణ సందర్భంగా అరెస్టు నుంచి రక్షణ కల్పించే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం, అరెస్టుపై ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. అలాగే, ఇరుపక్షాలు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి పిటిషనర్లను ఉద్దేశించి, "ఆస్తి విలువ ఎంత? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారు? చెల్లింపులు చెక్కు ద్వారా చేశారా? నగదు బదిలీ చేశారా? కొనుగోలుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచి మీ వాదనను నిరూపించాల్సిన బాధ్యత మీదే ఉంది" అని వ్యాఖ్యానించారు.
పిటిషనర్ల వాదనలు
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి. రఘు వాదనలు వినిపిస్తూ, శ్రీకాకుళం శివారు చాపురం పంచాయతీ పరిధిలోని భూమిని రజని అనే మహిళ నుంచి చిరంజీవి నాగు చట్టబద్ధంగా కొనుగోలు చేశారని తెలిపారు. ఇందుకోసం వివిధ దశల్లో రూ.37 లక్షలు చెల్లించామని, రిజిస్టర్డ్ సేల్ డీడ్ దానికి ఆధారమని వివరించారు.
మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాల సృష్టిలో పిటిషనర్లకు ఎలాంటి పాత్ర లేదని, అందువల్ల ఫోర్జరీ ఆరోపణలు వర్తించవని వాదించారు. మిగిలిన నేరాలు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని, అందువల్ల బీఎన్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు.
ప్రాసిక్యూషన్ వాదనలు
ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదిస్తూ, కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు పిటిషనర్లు ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. నకిలీ ధ్రువీకరణ పత్రాల సృష్టిలో కూడా వారి పాత్ర ఉందని, ఈ వ్యవహారాన్ని సివిల్ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.
కోర్టు వ్యాఖ్యలు
విచారణలో న్యాయమూర్తి కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు. రిజిస్టర్డ్ పత్రం చిరంజీవి నాగు పేరుపై ఉంటే, ఆయన తల్లిదండ్రులు తమ్మినేని సీతారాం, వాణిని ఎందుకు నిందితులుగా చేర్చారని ప్రశ్నించారు. కేసుకు రాజకీయ రంగు పులిమినట్లు కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ, అప్పట్లో తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకర్గా ఉన్నారని, అధికార దుర్వినియోగం చేసి ఇతర నిందితులతో కలిసి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగేలా ప్రభావితం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ల పాత్రపై వారి విద్యాసంస్థలో పనిచేసే కొందరు సిబ్బంది వాంగ్మూలాలు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి పోలీసు దర్యాప్తు తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం మారిన తర్వాత వాంగ్మూలాలు మారడం, దర్యాప్తు నిష్పాక్షికతపై సందేహాలు తలెత్తడం వంటి పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం దర్యాప్తు జరగాల్సిందే తప్ప, పరిస్థితులకు అనుగుణంగా కాకూడదని స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend