వందేమాతరం చట్టబద్ధ రక్షణకి పార్లమెంటులో బిల్లు
ప్రస్తుతం జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం (జనగణమన)కు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికి కూడా విస్తరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
న్యూఢిల్లీ: జాతీయ గేయం 'వందేమాతరం'కు చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్మెంట్) బిల్–2026'ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం (జనగణమన)కు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికి కూడా విస్తరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం ఉన్న చట్టంలో ఏం మారుతుంది?
ప్రస్తుతం అమల్లో ఉన్నచట్టం ప్రకారం జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గీతాన్ని అవమానించడం శిక్షార్హమైన నేరం. తాజా సవరణ ద్వారా జాతీయ గేయమైన వందేమాతరంను కూడా అదే చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
బిల్లులోని ప్రధాన ప్రతిపాదనలు
ప్రతిపాదిత బిల్లు ప్రకారం...
ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గేయాన్ని ఆలపించకుండా అడ్డుకోవడం లేదా కార్యక్రమానికి అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది.
వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించే చర్యలపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అయితే "అవమానం" లేదా "ఆటంకం" అనే పదాల నిర్వచనం, వాటి చట్టపరమైన పరిధి పార్లమెంట్ చర్చల అనంతరం తుది రూపు దాల్చనుంది.
ఎందుకు తీసుకొచ్చారు?
వందేమాతరం రచనకు 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ఈ జాతీయ గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన గేయంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతంతో పాటు వందేమాతరానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
విమర్శలు, ఆందోళనలు
ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, కొందరు రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రధానంగా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి వ్యక్తిగత లేదా మతపరమైన కారణాలతో గేయాన్ని ఆలపించకుండా ఉండడాన్ని నేరంగా పరిగణించడం సరైందా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.
అలాగే బిల్లులో పేర్కొన్న "అవమానం", "ఆటంకం" వంటి పదాలకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో భవిష్యత్తులో చట్టం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు లేదా అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలాపనను తప్పనిసరి చేస్తే అది కొత్త వివాదాలకు దారితీయవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న నిరసనల మధ్య ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తదుపరి ప్రక్రియ
ప్రస్తుతం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు, పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి ఆమోదం లభిస్తేనే చట్టంగా అమల్లోకి వస్తుంది. అంతకుముందు పార్లమెంట్లో జరిగే చర్చల సందర్భంగా బిల్లులోని వివాదాస్పద అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Login
Comments (0)