యార్లగడ్డకు వంశీ లీగల్ నోటీసు
హైదరాబాద్/విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు లీగల్ నోటీసులు పంపారు.
తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు, పరువుకు భంగం కలిగించే ఆరోపణలు చేశారని పేర్కొంటూ, వాటిని వెంటనే ఉపసంహరించుకుని ఏడు రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
లీగల్ నోటీసులో, యార్లగడ్డ వెంకట్రావు ఈ నెల 13న మీడియా సమావేశంలో తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు ప్రజల్లో తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగించాయని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం చట్టవిరుద్ధమని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ఏడు రోజుల్లోగా తన ఆరోపణలను అధికారికంగా ఉపసంహరించుకోవడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని వంశీ డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే సివిల్, క్రిమినల్ పరువునష్టం కేసులతో పాటు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు కూడా లేఖ
యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఇప్పటికే ఈ నెల 14న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిపై పార్టీ నాయకత్వం స్పందించాలని ఆయన కోరినట్లు సమాచారం.
ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్న యార్లగడ్డ
మరోవైపు, వల్లభనేని వంశీ పంపిన లీగల్ నోటీసుపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. తాను చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, వాటిని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణలు వాస్తవాల ఆధారంగానే ఉన్నాయని, అవసరమైతే చట్టపరంగా వాటిని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
Login
Comments (0)