ఉదయ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు
హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. తన వద్ద ఉన్న వాట్సాప్ చాట్లు, వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలు తమ మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపిస్తాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సూసైడ్ నోట్లో ప్రస్తావించిన అంశాలు, అందులో పేర్కొన్న డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
'వివాహం తర్వాత కూడా సంబంధం కొనసాగింది'
సూసైడ్ నోట్లో ఉదయ్ కృష్ణారెడ్డి చేసినట్లు చెబుతున్న ఆరోపణల ప్రకారం, 2025 నుంచి తనకు సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిణితో పరిచయం ఏర్పడి, అది ప్రేమ సంబంధంగా మారిందని పేర్కొన్నారు. ఆమె వివాహం జరిగిన తర్వాత కూడా తమ మధ్య సంబంధం కొనసాగిందని, భావోద్వేగపరంగానే కాకుండా శారీరక సంబంధం కూడా ఉందని ఆయన ఆరోపించారు.
ఆ అధికారిణి వాట్సాప్లో సందేశాలు పంపి తన గది తలుపు తెరవమని చెప్పేదని, అనంతరం గదికి వచ్చేదని కూడా ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. తమ మధ్య జరిగిన సంభాషణలు, వీడియోలు, ఇతర డిజిటల్ రికార్డులు తన మొబైల్ ఫోన్లలో ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
'వీడియో సాక్ష్యంగా తీశాను'
జూలై 9న జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆ రోజు సహచర అధికారిణి తన గదికి వచ్చి తనను ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుందని, ఆ సంఘటనను తాను సాక్ష్యంగా వీడియో తీసుకున్నానని ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఆమె పలుమార్లు తన గదికి రావద్దని హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో, ఆ వీడియోను ఆమె భర్తకు పంపానని కూడా ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అనంతరం జరిగిన పరిణామాలను వక్రీకరించి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన లేఖలో ఆరోపించారు.
నలుగురి పేర్లు ప్రస్తావన.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
సూసైడ్ నోట్లో ఫిర్యాదు చేసిన ట్రైనీ ఐపీఎస్ అధికారిణి, ఆమె భర్తతో పాటు బస్వత సైక్, కాశిష్ కల్రా పేర్లను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తావించారు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా వారు వ్యవహరించారని, తన ఆత్మహత్యాయత్నానికి వారే బాధ్యులని ఆరోపిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించిన వాట్సాప్ చాట్లు, వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలు తన ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
అసలు కేసు ఏమిటి?
కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. తనను లైంగికంగా వేధించడం, దాడి చేయడం, వెంటాడడం, బెదిరించడం, రహస్యంగా వ్యక్తిగత వీడియో చిత్రీకరించడం, ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆరోపణలు ఆమె ఫిర్యాదులో ఉన్నాయి.
ఈ ఫిర్యాదుపై సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) అంతర్గత విచారణ నిర్వహించగా, ప్రాథమికంగా (ప్రైమా ఫేసీ) ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. అనంతరం అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది. ఆయన సేవల కొనసాగింపుపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తీసుకోనుంది.
ఆత్మహత్యాయత్నం.. చికిత్స కొనసాగుతోంది
ఎఫ్ఐఆర్ నమోదు అయిన మరుసటి రోజు ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తొలుత ఇది ఆత్మహత్యాయత్నంగా అనుమానించినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితికి ఖచ్చితమైన కారణాలపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఇక ఒకవైపు లైంగిక వేధింపుల కేసు, మరోవైపు సూసైడ్ నోట్, అందులో పేర్కొన్న డిజిటల్ ఆధారాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే సూసైడ్ నోట్లోని ఆరోపణలు ఇప్పటివరకు దర్యాప్తు సంస్థల ద్వారా ధ్రువీకరించబడలేదు.
Login
Comments (0)