ఉదయ్ ఆత్మహత్యాయత్నం నాటకమే: పోలీసులు
హైదరాబాద్: మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో నమోదైన కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కేసు నమోదైన తర్వాత ఆయన ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చేరినట్లు తొలుత ప్రచారం జరిగినప్పటికీ, దర్యాప్తులో ఆ కోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం, జాతీయ పోలీస్ అకాడమీలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు చేయడంతో అత్తాపూర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మానసిక ఒత్తిడికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్‌పేటలో నివసిస్తున్న తన స్నేహితురాలి గదికి వెళ్లినట్లు తెలుస్తోంది.
అక్కడ ఆయన ఆహారం తీసుకోకుండా అధికంగా మద్యం సేవించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. సోమవారం ఉదయం ఆయనను నిద్రలేపేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు.
మంచం పక్కన మద్యం సీసాతో పాటు శానిటైజర్ కనిపించడంతో తొలుత ఆత్మహత్యాయత్నంగా భావించిన ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి, స్నేహితులు ఉదయం ఆయనను ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించి రక్త నమూనాలను పరీక్షలకు పంపారు.
ప్రాథమిక వైద్య పరీక్షల్లో రక్తంలో ఎలాంటి విషపదార్థాలు లభించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కేసును మళ్లించే ఉద్దేశంతో ఆత్మహత్యాయత్నం జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు. అయితే ఈ అంశాలపై పోలీసులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉండగా, జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన ఘటనపై ఇప్పటికే అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఆ విచారణ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిన అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి పరిపాలనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కేసు దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీస్ అకాడమీ అధికారులతో సమావేశమై ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అకాడమీలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు.
కాగా, ఈ కేసులో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఆరోపణలు, ఉదయ్ కృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్లో చేసిన ప్రతిఆరోపణలు రెండూ ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయి. వాటిపై తుది నిర్ధారణ రావాల్సి ఉంది.
Login
Comments (0)