ప్రకాశం ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు
స్ఫూర్తిగా నిలిచిన కానిస్టేబుల్... ఇప్పుడు ఐపీఎస్ హోదానే కోల్పోయే పరిస్థితి!
హైదరాబాద్: ఒకప్పుడు పట్టుదలకు ప్రతీకగా నిలిచాడు. కూరగాయలు అమ్ముతూ జీవితం ప్రారంభించి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించాడు. అక్కడి నుంచి ఉద్యోగాన్నే వదిలి ఐదో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించి ఐపీఎస్‌గా ఎంపికై ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. కానీ ఇప్పుడు అదే యువ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటూ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. శిక్షణ పూర్తికాకముందే నమోదైన ఈ కేసు ఆయన ఐపీఎస్ భవితవ్యంపైనా ప్రశ్నార్థకం నెలకొల్పింది.
హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదు ప్రకారం, జూన్ 23 నుంచి వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపడం, అకాడమీలో అవమానకరంగా ప్రవర్తించడం, వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేయడం, బలవంతంగా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వ్యక్తిగత సందేశాలు పరిశీలించడం వంటి చర్యలకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.
అంతేకాకుండా ఈ నెల 8, 9 తేదీల్లో తనను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బెదిరించడం, గొంతు పిసికి మెడపై కత్తి పెట్టడం, అనంతరం వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి వాటిని భర్తకు పంపిస్తానంటూ బెదిరించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులోని ఆరోపణలు ఇంకా కోర్టులో నిరూపించాల్సి ఉంది.
కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు...
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద పెరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే నానమ్మతో కలిసి కూరగాయలు అమ్మారు. 2013లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి ఐదేళ్లు సేవలందించారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా వెనుకడుగు వేయకుండా ఐదో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో 360వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
అయితే పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన దశలోనే ఆయనపై నమోదైన ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు ఫలితాలు, తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
Login
Comments (0)