అమెరికాలో స్కైడైవింగ్ ప్రమాదంలో విజయవాడ యువకుడి మృతి
విజయవాడ: అమెరికాలో స్కైడైవింగ్ చేస్తూ జరిగిన విషాద ప్రమాదంలో విజయవాడకు చెందిన యువ ఇంజినీర్ మణిచంద్ర తేజ గడ్డం (28) మృతి చెందారు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆరంజ్ పట్టణంలో ఈ నెల 12న జరిగిన ఈ ఘటనలో, స్కైడైవింగ్ అనంతరం కిందకు దిగుతున్న సమయంలో బలమైన గాలుల ప్రభావంతో ఆయన సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయారు. తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విజయవాడ గ్రామీణ మండలం రామవరప్పాడుకు చెందిన గడ్డం ప్రసాద్, ఉమాదేవి దంపతుల పెద్ద కుమారుడైన తేజ, విజయవాడలో పాఠశాల విద్య పూర్తి చేసి, అనంతరం హైదరాబాద్లోని ఐసీఎఫ్ఏఐ విశ్వవిద్యాలయంలో బీటెక్ చేశారు. 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశారు. 2024లో ఉద్యోగంలో చేరిన ఆయనకు ఇటీవల ప్రముఖ సంస్థ క్లావియో (Klaviyo)లో కొత్త ఉద్యోగం లభించింది. సోమవారం ఉదయం కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉండగా, ఆదివారం జరిగిన ప్రమాదం ఆయన కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది.
తేజ ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు సుమారు రూ.50 లక్షల విద్యా రుణం తీసుకున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ రుణాన్ని తీర్చాలని కుటుంబం ఆశలు పెట్టుకుంది. అయితే, కొత్త ఉద్యోగంలో చేరకముందే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అమెరికాలోని స్నేహితులు, బంధువులు ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఫండ్రైజింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
Login
Comments (0)