హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపునకు ఆదేశం
హైదరాబాద్: హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency–HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నల్గొండ జిల్లాకు చెందిన ఎ.వి. రంగనాథ్ 1996లో గ్రూప్-1 డీఎస్పీగా పోలీసు సేవల్లో చేరారు. అనంతరం 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఎస్పీ, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించి, కఠినమైన అధికారిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం 2024లో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఆయనను కమిషనర్‌గా నియమించింది. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపులో దూకుడుగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలిచారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు స్థలంలోని ఫెన్సింగ్‌ను తొలగించి, కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించారు.
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి హాజరై, వివాదాస్పద స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లలేదని తెలిపారు. రంగనాథ్ దాఖలు చేసిన అఫిడవిట్లో కోర్టులపై తమకు పూర్తి గౌరవం ఉందని, లోతుకుంట భూమిలోకి ప్రవేశించలేదని పేర్కొన్నారు. అయితే ఒకే అంశంపై పలుమార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారిగా రంగనాథ్ వ్యవహరించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
‘‘కోర్టులను ఆశ్రయించడం ప్రతి పౌరుడి హక్కు. ఉన్నతాధికారిగా ఉండి కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదు. చట్టం ముందు అందరూ సమానమే. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని అధికారులను ఉపేక్షిస్తే న్యాయవ్యవస్థ గౌరవం దెబ్బతింటుంది’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రంగనాథ్ అఫిడవిట్లో నిర్ద్వంద్వ క్షమాపణ కూడా లేకపోవడం ఆయన వైఖరిని సూచిస్తోందని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో హైడ్రా అధికారాలపైనా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ వంటి శాఖలు ఉండగా కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వుతో ఏర్పాటైన హైడ్రాకు ఇంత అధికారం ఎలా వచ్చింది? ఎంపిక చేసిన కొన్ని నిర్మాణాలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? హైడ్రా అధికారులు చట్టానికి అతీతం కాదు. కోర్టు పరిధిలోనే పనిచేయాలి’’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ, ప్రభుత్వం పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Login
Comments (0)