పీపీపీ విధానంలో అప్పగిస్తే ప్రభుత్వానికి ముందస్తుగా రూ.1,500 కోట్లు ప్రీమియం లభిస్తుంది: మంత్రి
అమరావతి: రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానం అంటే పోర్టును అమ్మడం కాదని, కేవలం నిర్వహణ, ఆపరేషన్ల బాధ్యతలను మాత్రమే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని తెలిపారు. పోర్టు యాజమాన్య హక్కులు, భూములు, కీలక అధికారాలన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని చెప్పారు.
సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను అదానీ గ్రూప్‌కు విక్రయించారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు, జాతీయ రహదారులు, పారిశ్రామిక పార్కులు కూడా పీపీపీ విధానంలోనే విజయవంతంగా నిర్వహిస్తున్నారని వివరించారు.
రామాయపట్నం పోర్టు నిర్వహణను పీపీపీ విధానంలో అప్పగిస్తే ప్రభుత్వానికి ముందస్తుగా రూ.1,500 కోట్లు ప్రీమియంగా లభిస్తాయని తెలిపారు. అదనంగా కనీస రెవెన్యూ హామీతో మొదటి ఏడాది నుంచే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఒప్పంద నిబంధనలు రూపొందించామని చెప్పారు. భూములకు బదులుగా ప్రభుత్వానికి 12 శాతం నాన్-డైల్యూటబుల్ ఈక్విటీ కొనసాగుతుందని, భవిష్యత్తులో సుమారు రూ.16,000 కోట్ల విస్తరణ పెట్టుబడులు వచ్చినా ప్రభుత్వ వాటా తగ్గదని వెల్లడించారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ, ఈ ఏడాది డిసెంబరు నాటికి రామాయపట్నం, మూలపేట పోర్టులను పూర్తి చేయడమే లక్ష్యమని, మచిలీపట్నం పోర్టును వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
Don’t receive OTP? Resend