జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన పీవీ సింధు
రెండేళ్ల పోరాటానికి బంగారు ముగింపు.. ‘పాత సింధు’ మళ్లీ కనిపించింది!
టోక్యో: గెలుపు అనేది ఛాంపియన్‌కు కొత్త కాదు. కానీ ఓటముల పరంపర తర్వాత మళ్లీ గెలవడం మాత్రం ప్రతి ఛాంపియన్కూ అత్యంత కఠినమైన పరీక్ష. గత రెండేళ్లుగా అదే పరీక్షను ఎదుర్కొంటున్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఎట్టకేలకు తన మార్క్ చూపించింది. వరుస టోర్నీల్లో తొలి లేదా రెండో రౌండ్‌కే పరిమితమవుతూ, తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందా అనే సందేహాలను ఎదుర్కొన్న ఈ తెలుగు అమ్మాయి.. జపాన్ ఓపెన్‌లో చరిత్ర సృష్టిస్తూ మరోసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌కు తన సత్తా చాటింది.
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, స్వదేశీ ప్రేక్షకుల మద్దతుతో బరిలోకి దిగిన అకానె యమగూచిని 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో ఓడించిన సింధు, జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత ఆమె కెరీర్లో ఇదే అత్యంత ప్రతిష్ఠాత్మక టైటిల్. 2024 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ విజయం తర్వాత సింధుకు ఇదే తొలి ట్రోఫీ.
ఆరంభం నుంచే ఆధిపత్యం
ఫైనల్లో సింధు ఆటలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. తొలి గేమ్‌లోనే దూకుడైన స్మాష్‌లు, ఖచ్చితమైన నెట్ ప్లే, కోర్టు నలుమూలలా ప్రత్యర్థిని పరుగులు పెట్టించే ర్యాలీలతో ఆధిపత్యం చెలాయించింది. యమగూచి కొన్ని దశల్లో వరుస పాయింట్లతో తేడాను తగ్గించే ప్రయత్నం చేసినా, ప్రతి సారి సింధు తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ వరుస పాయింట్లు సాధించింది. 21-17తో తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఒత్తిడిలోనూ నిలకడ
రెండో గేమ్‌లో యమగూచి మరింత దూకుడుగా ఆడింది. స్వదేశీ అభిమానుల హర్షధ్వానాల మధ్య పోరాటాన్ని తీవ్రతరం చేసింది. కొంతసేపు ఇరువురు షట్లర్లు హోరాహోరీగా పాయింట్లు సాధించినా, కీలక దశలో సింధు వేగాన్ని మరింత పెంచింది. శక్తివంతమైన స్మాష్‌లు, కచ్చితమైన క్రాస్‌కోర్ట్ షాట్లు, అద్భుతమైన రక్షణతో వరుస పాయింట్లు సాధించి 21-17తో రెండో గేమ్నూ గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
విమర్శలకు బ్యాట్‌తో కాదు... రాకెట్‌తో సమాధానం
గత రెండు సీజన్లుగా సింధు ఆటపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. గాయాలు, ఫామ్ కోల్పోవడం, ప్రారంభ రౌండ్లలోనే నిష్క్రమించడం, యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ... ఇలా ఎన్నో సవాళ్లు ఆమెను వెంటాడాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వరకు కొనసాగగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే జపాన్ ఓపెన్ విజయం ఆ సందేహాలకు గట్టి సమాధానంగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకుని, ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిని ఆమె సొంతగడ్డపై ఓడించడం ద్వారా తనలోని ఛాంపియన్ ఇంకా సజీవంగానే ఉన్నాడని సింధు నిరూపించింది.
కొత్త ఆరంభానికి సంకేతమా?
31 ఏళ్ల వయసులో సాధించిన ఈ విజయం కేవలం మరో టైటిల్ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందిన ఒక ఛాంపియన్ పునరాగమనానికి నిదర్శనం. వరుస వైఫల్యాల తర్వాత కూడా కఠోర శ్రమతో మళ్లీ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని సింధు మరోసారి నిరూపించింది. భారత బ్యాడ్మింటన్ అభిమానులకు ఇది ఒక విజయోత్సవమే కాకుండా, రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ క్రీడలు, 2028 ఒలింపిక్స్‌కు ముందు ఆశలను రెట్టింపు చేసిన విజయం.
Login
Comments (0)