కుటుంబ సభ్యుల ఆస్తులూ జప్తు చేయొచ్చు: ట్రిబ్యునల్
హైదరాబాద్: నేరం ద్వారా సంపాదించిన ఆస్తులు కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నప్పటికీ, వాటిని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఉందని పీఎంఎల్ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది.
మనీలాండరింగ్ కేసులో కుటుంబ సభ్యులు నిందితులు కాకపోయినా, నేర ఆదాయంతో సంబంధం ఉన్న ఆస్తులను జప్తు చేయవచ్చని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
ఈ తీర్పు మాజీ ప్రభుత్వ ఇంజినీర్ మెట్ట అప్పన్న కుటుంబ సభ్యుల పేర్లలో ఉన్న ఆస్తుల జప్తు కేసులో వెలువడింది. అప్పన్నతో పాటు ఆయన ఐదుగురు కుటుంబ సభ్యులు దాఖలు చేసిన అప్పీళ్లను ట్రిబ్యునల్ కొట్టివేసింది. కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసులో నిందితులు కానందున వారి ఆస్తులను జప్తు చేయడం చట్టవిరుద్ధమన్న వాదనను ట్రిబ్యునల్ తిరస్కరించింది.
ట్రిబ్యునల్ అభిప్రాయం ప్రకారం, ఆస్తులు ఎవరి పేర్లలో నమోదయ్యాయన్నది ముఖ్యం కాదని, అవి నేరం ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసినవని నిరూపితమైతే పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం ఈడీ వాటిని అటాచ్ చేయవచ్చని పేర్కొంది.
రూ.58.5 లక్షల ఆస్తుల జప్తు యథాతథం
ఈ కేసులో ఈడీ సుమారు రూ.58.5 లక్షల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. 2019లో పీఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ ఆ చర్యను సమర్థించగా, తాజాగా అప్పిలేట్ ట్రిబ్యునల్ కూడా అదే నిర్ణయాన్ని కొనసాగించింది.
ఏమిటీ కేసు?
మెట్ట అప్పన్న విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సమయంలో, 2010లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసింది. అప్పట్లో ఆయన వద్ద రూ.84.88 లక్షల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అనంతరం ఏసీబీ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ 2017లో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, 2018లో సంబంధిత ఆస్తులను అటాచ్ చేసింది.
'చట్టబద్ధమైన ఆదాయమే' వాదనకు ఆధారాలు లేవు
కుటుంబ సభ్యులు ఆస్తులు వ్యవసాయ ఆదాయం, రియల్ ఎస్టేట్ కమిషన్లు తదితర చట్టబద్ధమైన వనరుల ద్వారా కొనుగోలు చేశామని ట్రిబ్యునల్ ముందు వాదించారు. అయితే ఆ వాదనకు తగిన ఆధారాలు సమర్పించలేకపోయారని ట్రిబ్యునల్ పేర్కొంది. దీంతో ఆస్తులు చట్టబద్ధమైన ఆదాయంతో సమకూరినవని నిరూపించలేకపోయారని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన ట్రిబ్యునల్
విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన ట్రిబ్యునల్, మనీలాండరింగ్ అనేది కొనసాగుతున్న నేరం (Continuing Offence) అని పేర్కొంది. నేర ఆదాయంతో సంబంధం ఉన్న ఆస్తులు కుటుంబ సభ్యులు లేదా ఇతరుల పేర్లలో ఉన్నా వాటిని జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది.
ఈ తీర్పు భవిష్యత్తులో మనీలాండరింగ్ కేసుల్లో కుటుంబ సభ్యుల పేర్లలో ఉన్న ఆస్తుల జప్తుకు సంబంధించి కీలక న్యాయ మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Login
Comments (0)