ఆధార్ రూపకర్త నందన్ నీలేకనికి ఎన్‌టిఎ టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు
కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న ప్రముఖ టెక్నోక్రాట్, ఆధార్ రూపకర్త నందన్ నీలేకనిని పరీక్షల సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌కు ఛైర్మన్‌గా మోడి ప్రభుత్వం నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
న్యూఢిల్లీ: ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ టెక్నోక్రాట్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌కు ఛైర్మన్‌గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజకీయ అనుబంధాల కంటే ఆయన సాంకేతిక నైపుణ్యం, పరిపాలనా అనుభవానికే కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నీలేకని 1981లో ఎన్.ఆర్. నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అనంతరం 2002 నుంచి 2007 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఆయన నాయకత్వంలో ఇన్ఫోసిస్ అంతర్జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించింది. అనంతరం సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
ఆధార్ రూపకర్త
2009లో ఇన్ఫోసిస్‌ను వీడి అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆహ్వానం మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తొలి ఛైర్మన్‌గా, కేంద్ర కేబినెట్ మంత్రి హోదాతో బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలోనే ఆధార్ ప్రాజెక్టు రూపుదిద్దుకుని, దేశవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపును అందించే వ్యవస్థగా అభివృద్ధి చెందింది.
డిజిటల్ గవర్నెన్స్, భారీ సాంకేతిక ప్రాజెక్టుల అమలులో నీలేకని కీలక పాత్ర పోషించారు. టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఫర్ యూనిక్ ప్రాజెక్ట్స్ (TAGUP)కు నాయకత్వం వహించడంతో పాటు, యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలకు పునాది వేసిన సాంకేతిక విధానాల రూపకల్పనలో భాగమయ్యారు. 2023లో జీ20 డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాస్క్‌ఫోర్స్‌కు సహాధ్యక్షుడిగానూ నియమితులయ్యారు.
కాంగ్రెస్ నుంచి ఎంపిగా పోటీ
రాజకీయంగా 2014లో కాంగ్రెస్‌లో చేరిన నీలేకని, బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అనంత్‌కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ వివిధ రాజకీయ ప్రభుత్వాలు ఆయన నైపుణ్యాన్ని వినియోగించుకోవడం కొనసాగించాయి. ఇప్పుడు నీట్ వంటి పరీక్షల్లో పారదర్శకత, భద్రత, సాంకేతిక సంస్కరణలను తీసుకురావాల్సిన కీలక బాధ్యతను కేంద్రం మరోసారి ఆయనకు అప్పగించింది.
Login
Comments (0)