ఆగస్టు 1న భోగాపురంలో పలు కీలక ప్రాజెక్టుల ప్రారంభం
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు జీఎంఆర్ చేపట్టిన పలు కీలక విద్యా, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.
విమానాశ్రయ ప్రయాణికుల టెర్మినల్ భవనంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యూ సిటీలను దేశానికి అంకితం చేయనున్నారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రధానమంత్రికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలకాలని సూచించారు.
అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు తెలియజేస్తూ, విమానాశ్రయ టెర్మినల్‌తో పాటు జీఎంఆర్ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యూ సిటీని కూడా ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు.
విమానాశ్రయంతో పాటు విద్య, నైపుణ్యాలకు ఊతం
భోగాపురం విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ ఎకోసిస్టమ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థలు విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఉత్తరాంధ్రను విమానయాన, విద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇవి కీలకంగా మారనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
లాజిస్టిక్స్ హబ్‌గా భోగాపురం
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అంతర్జాతీయ అనుసంధానం పెరగడంతో పాటు, ఈ విమానాశ్రయం లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చెంది పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.
భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం
విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, భూయజమానులను ప్రత్యేకంగా సత్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారికి ఒక్కసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని సూచించారు. ప్రాజెక్టు విజయవంతం కావడంలో వారి సహకారం ఎంతో విలువైనదని ఆయన పేర్కొన్నారు.
ప్రజల పండుగలా ప్రారంభోత్సవం
ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్, భద్రత, ప్రజలకు తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు తదితర అన్ని అంశాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే జూలై 22 నుంచి 31 వరకు భోగాపురం విమానాశ్రయంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటికీ విమానాశ్రయం ప్రాధాన్యం చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రారంభోత్సవాన్ని ప్రజల పండుగగా నిర్వహించాలని అన్నారు.
అరకు కాఫీ బ్రాండింగ్‌కు అవకాశం
ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపై ప్రోత్సహించిన అరకు కాఫీ బ్రాండింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఉత్తరాంధ్ర వ్యవసాయం, పర్యాటకం, పారిశ్రామిక అవకాశాలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు ఈ ప్రారంభోత్సవం వేదిక కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులందరూ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Login
Comments (0)