By Ramesh Kandula
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మీద నార్వే పత్రిక ఒక కార్టూన్ వేసింది. ఇండియా గురించి పాశ్చాత్య దేశాలకున్న చిన్న చూపు, అవగాహనారాహిత్యం ఈ కార్టూన్ ద్వారా మరోసారి బట్టబయలైంది. అమెరికన్ రాజకీయ నాయకులకే ఇండియా గురించి ఏవీ తెలియదు అనుకుంటే, యూరోపియన్ దేశాల్లో ఉండే వాళ్లు కూడా 19వ శతాబ్దపు కాలం చెల్లిన ఐడియాల్లోనే బతుకుతున్నారని ఈ కార్టూన్ మరోసారి వెల్లడించింది.
ప్రధాని మోడి తాజా పర్యటనలో నార్వే సందర్శించాడు. ఆయన పర్యటన తర్వాత నార్వే పత్రిక Aftenposten (Evening Post) లో ఒక కార్టూన్ వేశారు. స్క్రీన్ మీద చూడొచ్చు కార్టూన్ ని. నరేంద్ర మోడిని ఒక పాముల్ని ఆడించేవాడిగా చిత్రీకరించారు. పాము తల ప్లేస్ లో పెట్రోలు, డీజిల్ నాజిల్ ని పెట్టారు.
ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో రష్యాని పశ్చిమ యూరప్ దేశాలు బహిష్కరించాయి కాబట్టి, ఆ దేశం నుంచి ఎవరూ క్రూడాయిల్ ని కొనగూడదు. అయినా ఇండియా కొంటోందని వెటకారం అన్న మాట. ఆ విమర్శే ఎంతో అహంకారపూరితం. యూరప్ దృష్టితోనే అందరూ ప్రపంచాన్ని చూడాలనే ఆధిపత్య ధోరణి. కాని, ఈ కార్టూన్ లో దానికంటే అభ్యంతరకర విషయం మరొకటి ఉంది.
అదేంటంటే, భారత దేశ ప్రధానిని 21 వ శతాబ్దంలో కూడా ఒక snake charmer గా చూడటం. ఇండియా వలస దేశంగా ఉన్నప్పుడు, భారత్ అంటే పాముల పట్టే వాళ్ల దేశంగా యూరోపియన్లు చూసేవాళ్లు. ఆ దశ నుంచి ప్రపంచం, ప్రపంచంతో పాటు ఇండియా, చాలా ముందుకు వెళ్లాయి. భారత్ ఇవాళ snake charmer కాదు mouse charmer అని మోడియే 2014లో అన్నాడు. భారత్ ఇవాళ ఎంతో చరిత్ర కలిగిన ఒక ఆధునిక, బలమైన దేశంగా ఎదుగుతోంది. ప్రపంచంలో నాలుగవ, లేక అయిదొవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అతిపెద్ద ప్రజాస్వామ్యం.
ప్రపంచంలో ఆరో వంతు ప్రజలకి నెలవు.
అలాంటి ఇండియాని ఇంకా ఆ పాచిపోయిన వలసవాద ధోరణితో, బావిలో కప్పలాగా, పడికట్టు భావజాలంతో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయటం నార్వే లాంటి అంగుష్ట మాత్ర దేశానికి తగిన విషయం కాదు. ఆ దేశంలో మీడియా వ్యవస్థ ఇంకా 19వ శతాబ్దపు బూజు పట్టిన భావాలతోనే ఇండియాని చూస్తోంది అనటానికి ఈ కార్టూన్ ఉదాహరణ.
నార్వే జనాభా 60 లక్షలకి తక్కువ. అంటే, హైదరాబాద్ జనాభాలో మూడో వంతు. మొత్తం నార్వే దేశ జనాభాయే హైదరాబాద్ జనాభాలో మూడో వంతు. భారత దేశ జనాభాలో ఎన్నో వంతో ఇక ఊహించుకోండి. అటువంటి ఒక పిల్ల దేశం ఎంతో సంక్లిష్టమైన, వైవిధ్యభరిత దేశమైన ఇండియా గురించి ఇంకా పిచ్చి ప్రేలాపనలు పేలడం అంటే ఆ దేశాలు ఇంకా ఆ వలస భావజాలం మత్తులో నుంచి బయటికి రాలేదని అర్థం.
మన దేశంలో ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే, బిజెపి ప్రభుత్వం అంటేనో, నరేంద్ర మోడి విధానాలు అంటేనో మనలో కొంతమందికి వ్యతిరేకత ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అది అత్యంత సహజం. అయితే, మోడి మీద మనకి ద్వేషం కాబట్టి, వేరే ఏ దేశం అయినా, మోడిని అవమానిస్తే, మోడి పేరుతో భారత దేశాన్ని అవమానిస్తే దాన్ని కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు. అంతర్గతంగా దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించడం, లేక మోడిని విమర్శించడం వేరు; వేరే దేశం, వేరే దేశంలో వ్యవస్థలు మోడిని, ఇండియాని చిన్నబుచ్చడం వేరు.
కాని దురదృష్టవశాత్తూ మోడి పట్ల నిలువెల్లా వ్యతిరేకతతో, విదేశీ సంస్థలు ఇండియాని bad light లో చూపిస్తే అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు, ఆ విదేశీ సంస్థలేవో ఆకాశం నుంచి ఊడిపడిన పత్తిత్తులైనట్టు మనవాళ్లే వాళ్లకి లేనిపోని క్రెడిట్ ని, క్రెడిబిలిటిని ఇస్తారు.
ఈ మాట ఎందుకంటున్నాను అంటే, నార్వేలో మోడి పర్యటన సందర్భంగా ఒక స్థానిక జర్నలిస్టు చిన్న సీన్ క్రియేట్ చేసింది. రెండు దేశాల పిఎం లు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, స్టేజి దిగి వెళ్లిపోతున్న టైంలో Halle Lyng అనే ఈవిడ కేకలేసింది. మోడి, నువ్వెందుకు ప్రెస్ ని ఎదుర్కోవు, ఎందుకు రిపోర్టర్లతో మాట్లాడవు అని. మోడి గారు ఆ మాటలు విన్నాడో లేదో కూడా తెలియదు. ఆవిడ ఆ కేకలు వేస్తున్న సమయంలోనే మోడి, నార్వే పిఎం ఆ గది లోంచి దాదాపుగా వెళ్లిపోయారు.
ఆవిడేదో ఒక పెద్ద విప్లవకారిణి అయినట్టు అదొక పెద్ద వార్త ప్రపంచవ్యాప్తంగా. మోడి గారు దేశంలో ప్రెస్ మీట్లు పెట్టడనే విమర్శ ఉంది. దీనిమీద దేశంలో చాలాసార్లు చాలామంది కామెంటేటర్లు ట్రోల్ చేశారు. అది ఓకె కాని, ఎక్కడో నార్వేలో ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని ఆవిడెవరో కావాలని, ఉద్దేశపూర్వకంగా, అమర్యాదకరంగా అరిస్తే, అదేదో గొప్ప విషయంగా రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేయటం దురదృష్టకరం . పిఎంని విమర్శించడానికి ప్రతిపక్ష నాయకుడికి వేరే దేశాల మద్దతు అవసరం లేదు.
ఈ సందర్భంగా ప్రెస్ ఫ్రీడం గురించి కూడా చర్చ జరిగింది. నార్వే ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ లో నెంబరు వన్. ఇండియానేమో నెంబరు 157. అంటే అడుగున ఉంది. ఈ ర్యాంకింగులు నాకు హాస్యాస్పదంగా ఉంటాయి. Reporters without borders అనే సంస్థ ఈ ర్యాంకింగుల్ని ఇస్తోంది. వీళ్ల ప్రాతిపదిక ఏంటని నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే, వీళ్ల ర్యాంకింగ్ ప్రకారం, పాకిస్తాన్ లో ఇండియా కంటే ఎక్కువ పత్రికా స్వేచ్ఛ ఉంది. పాకిస్తాన్ ర్యాంకు 150 అయితే, ఇండియా ర్యాంకింగ్ 157. కువాయిట్, ఓమన్, దక్షిణ సూడాన్, అంగోలా, ఉగాండా లాంటి దేశాల్లో కూడా ఇండియా కంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కువట, ఈ ర్యాంకింగుల ప్రకారం.
ఈ దేశాలకి, ఇండియాకి ఎక్కడా పోలిక లేదని, ఇండియాలో ఆయా ప్రభుత్వాల్ని బట్టి కొన్ని ఇబ్బందులున్నా, పత్రికా స్వేచ్ఛకి రాజ్యాంగపరంగా చాలా గ్యారంటీలు ఉన్నాయని దేశంలో అందరికి తెలుసు. మనకి ఇష్టం లేని రాజకీయ నాయకుల్ని ఏ స్థాయిలో ఈ దేశంలో ట్రోల్ చేస్తామో మనకి తెలుసు. అయినా, మోడి వచ్చాక పత్రికా స్వేచ్ఛ పోయినట్టు, అంతకుముందు చాలా ఉన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు.
2014కి ముందు ఈ సోకాల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ లో ఇండియా ర్యాంకు 160 దేశాల్లో 140. ఇప్పుడు 180 దేశాల్లో 157. కాబట్టి, కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ర్యాంకుల్లో పెద్ద తేడా లేదని అర్థం. అప్పటి లెక్కలైనా, ఇప్పటి లెక్కలైనా, ఈ ర్యాంకింగులు అమెరికాలో కూర్చొని కొంతమంది వాళ్లకి తోచినట్టు ఇచ్చే ర్యాంకులు అనేది నా అభిప్రాయం. దీనివెనక కొంతమంది ఎన్జీవోల ప్రభావం ఉంటుంది అనేది నా అనుమానం.
మోడి ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడులు జరగడం లేదా అంటే, ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాకపోతే, 60 లక్షల జనాభా కూడా లేని నార్వేతో, 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాని – ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా – పోల్చడం అసమంజసం అని చెప్పాలి.
Don’t receive OTP? Resend