తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అందుబాటు ధరలో ఫ్లాట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం (జూలై 21) నుంచి మీ సేవా పోర్టల్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఇందిరమ్మ గృహ పథకాన్ని సోమవారం (జూలై 20) ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద నిర్మించే ప్రతి ఫ్లాట్ నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలుగా అంచనా వేశారు. ఒక్కో ఫ్లాట్‌కు 528 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉంటుంది.
ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. మిగిలిన సుమారు రూ.6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.
ఎక్కడ దరఖాస్తు చేయాలి?
అర్హులైన వారు సమీప మీ సేవా కేంద్రాల్లో, మీ సేవా పోర్టల్ లేదా 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మంగళవారం సాయంత్రం వరకు వాట్సాప్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు.
దరఖాస్తు ఫీజు, ఈఎండీ
దరఖాస్తు ఫీజు రూ.100. అదనంగా రూ.10,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) చెల్లించాలి. దరఖాస్తుదారు ఎంపిక కాకపోతే ఈ ఈఎండీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
దరఖాస్తుకు అవసరమైన వివరాలు
దరఖాస్తులో అభ్యర్థి పేరు, ఆధార్ నంబర్, జన్మతేది, వార్షిక కుటుంబ ఆదాయం, వార్డు, సర్కిల్, ప్రాజెక్టు ప్రాంతం వంటి వివరాలు నమోదు చేయాలి. అలాగే ఆధార్ కార్డు ముందు, వెనుక భాగాల ఫొటోలను JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Login
Comments (0)