సాయికృష్ణ ఎక్కడ? జూన్ 29 తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి?
విజయవాడకు చెందిన 26 ఏళ్ల గాదె సాయికృష్ణ అదృశ్య వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం అతని ఆచూకీ తమకు తెలియదని హైకోర్టుకు చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. జూన్ 29లోగా సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే అత్యంత కీలకమైన ప్రశ్న ఒక్కటే. జూన్ 29న సాయికృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపరచలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?
సాయికృష్ణపై గంజాయి స్మగ్లింగ్, హత్యాయత్నం, అత్యాచారం, పోలీసులపై దాడి వంటి 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో అతనిపై రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మే 9న ప్రకాశం జిల్లా మార్కాపురంలో అతడిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. తన కుమారుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని, అనంతరం లాకప్‌లో మరణించాడని, ఆధారాలు లేకుండా చేసేందుకు రహస్యంగా దహనం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. "నా కొడుకు బతికుంటే నా కళ్లముందు నిలబెట్టండి. చనిపోయి ఉంటే కనీసం అతని బూడిద అయినా ఇవ్వండి" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో కృష్ణలంక సీఐ నాగరాజును వేకెంట్ రిజర్వ్‌కు బదిలీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి సిఐని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరపాలని కూడా ఆదేశించారు.
అయితే ఇవన్నీ ప్రాథమిక చర్యలే. అసలు పరీక్ష జూన్ 29 తర్వాతే. కోర్టు ఆదేశాల మేరకు సాయికృష్ణను పోలీసులు హాజరుపరచలేకపోతే, ఇది సాధారణ మిస్సింగ్ కేసుగా కాకుండా కస్టడీ డెత్ లేదా హత్య కేసు కోణంలో విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. అతడిని చివరిసారిగా అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారుల పాత్రపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సాయికృష్ణ జీవించి ఉన్నాడా? లేక మరణించాడా? అన్నది మాత్రమే కాదు, చట్ట పరిరక్షకులే చట్టాన్ని ఉల్లంఘించారా అన్న ప్రశ్నకు కూడా జూన్ 29 తర్వాత సమాధానం దొరకనుంది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ విశ్వసనీయతకు ఈ కేసు ఒక కీలక పరీక్షగా మారింది.
Login
Comments (0)