ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానానికి పడిపోయిన ఏపి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందంటున్న ఏపీకి నితి ఆయోగ్ ఇండెక్స్‌లో 8వ ర్యాంక్ ఎందుకు?
అమరావతి: రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed of Doing Business) అమలు చేస్తున్నామని, పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం చెబుతున్న వేళ, నితి ఆయోగ్ విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ (Investment Friendliness Index-IFI) 2026లో ఏపీ కి పెద్ద రాష్ట్రాల్లో ఆరో స్థానం, దేశవ్యాప్తంగా ఎనిమిదో స్థానం మాత్రమే దక్కడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) ర్యాంకింగ్‌లను నిలిపివేసి, వాటి స్థానంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింత సమగ్రంగా అంచనా వేసే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ (IFI)ను నితి ఆయోగ్ ప్రవేశపెట్టింది. కేవలం అనుమతులు ఎంత వేగంగా ఇచ్చారనే అంశం కాకుండా, మొత్తం 84 సూచికలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌లు ప్రకటిస్తోంది.
ఏపీకి 48.7 మార్కులు లభించగా, రాష్ట్రం 'ఫ్రంట్‌రన్నర్స్' విభాగంలో చోటు దక్కించుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా వంటి రాష్ట్రాలు మాత్రమే 'టాప్ పెర్ఫార్మర్స్' జాబితాలో నిలిచాయి.
పెట్టుబడుల్లో అగ్రస్థానం... ర్యాంకులో మాత్రం వెనుకే
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది. గూగుల్ డేటా సెంటర్, పునరుత్పాదక ఇంధనం, పారిశ్రామిక ప్రాజెక్టులు, పోర్టులు, డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు ఆకర్షించినప్పటికీ, IFI ర్యాంకింగ్‌లో మాత్రం టాప్-5లోకి చేరలేకపోయింది.
ఎక్కడ మార్కులు తగ్గాయి?
నితి ఆయోగ్ విశ్లేషణ ప్రకారం రాష్ట్రానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితి (Financial Health) విభాగంలో తక్కువ స్కోరు వచ్చింది. అధిక ప్రభుత్వ అప్పులు, భారీ సంక్షేమ వ్యయం, పరిమిత ఆర్థిక వెసులుబాటు రాష్ట్ర ర్యాంకును ప్రభావితం చేశాయి.
అలాగే బిజినెస్ క్లైమేట్ విభాగంలో కూడా ఏపీకి 9వ స్థానం మాత్రమే లభించింది. గత కొన్నేళ్లలో రాజధాని విధానం, పారిశ్రామిక భూముల కేటాయింపుల్లో జరిగిన విధాన మార్పులు, దీర్ఘకాలిక విధాన స్థిరత్వంపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది.
NITI Aayog Investment Friendliness Index 2026
| Rank | State / Union Territory | Score |
|---|---|---|
| 1 | Gujarat | 56.6 |
| 2 | Maharashtra | 53.7 |
| 3 | Tamil Nadu | 53.3 |
| 4 | Goa | 53.1 |
| 5 | Odisha | 52.4 |
| 6 | Delhi | 49.9 |
| 7 | Madhya Pradesh | 48.9 |
| 8 | 🟨 Andhra Pradesh | 48.7 |
| 9 | Karnataka | 48.7 |
| 10 | Rajasthan | 48.1 |
| 11 | Uttarakhand | 47.5 |
| 12 | Chhattisgarh | 47.5 |
| 13 | Telangana | 47.3 |
| 14 | Assam | 47.3 |
| 15 | Haryana | 47.1 |
| 16 | Chandigarh | 47.0 |
| 17 | Kerala | 46.6 |
| 18 | Himachal Pradesh | 46.1 |
| 19 | Uttar Pradesh | 45.0 |
| 20 | Tripura | 45.0 |
| 21 | Puducherry | 44.9 |
| 22 | Punjab | 44.7 |
| 23 | Meghalaya | 43.0 |
| 24 | West Bengal | 41.3 |
| 25 | Jharkhand | 41.3 |
| 26 | Bihar | 41.2 |
| 27 | Nagaland | 41.2 |
| 28 | Jammu & Kashmir | 40.2 |
| 29 | Mizoram | 39.9 |
| 30 | Arunachal Pradesh | 37.5 |
| 31 | Dadra & Nagar Haveli and Daman & Diu | 37.1 |
| 32 | Sikkim | 36.6 |
| 33 | Manipur | 32.3 |
| 34 | Andaman & Nicobar Islands | 30.2 |
| 35 | Ladakh | 27.0 |
| 36 | Lakshadweep | 24.5 |
జగన్ ప్రభుత్వ లెగసీ?
అమరావతి విషయంలో గందరగోళానికి, పారిశ్రామిక విధానాల్లో అనిశ్చితికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. భారీగా అప్పులు చేయటం, ఆర్థిక క్రమశిక్షణని పట్టించుకోకపోవటం, సంక్షేమ కార్యక్రమాల పేరుతో నేరుగా డబ్బుని పంపిణీ చేయటమే ప్రధాన కార్యక్రమంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించడం నీతి ఆయోగ్ ఇండెక్స్ లో ర్యాంకింగ్ పడిపోవటానికి దోహదపడ్డాయనే విషయంలో సందేహం లేదు.
కూటమి ప్రభుత్వం తప్పులు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార వాతావారణాన్ని గణనీయంగా మెరుగుపరిచిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉంది. అయితే అదే సమయంలో, వారం వారం భారీగా అప్పులు చేయటంలో, సంక్షేమ పథకాల్ని గతంలో కంటే ఇంకా పెంచి మరీ డబ్బు పంచే విషయంలో కూటమి ప్రభుత్వమూ ఆర్థిక క్రమశిక్షణని పాటించడం లేదు. ర్యాంకింగ్ పడిపోవటంలో వీటి పాత్ర ఉంది.
ఏపీ బలాలు ఇవే
అయితే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని నితి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.
దేశంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తలసరి డిజిటల్ లావాదేవీల్లో దేశంలోనే అత్యధికంగా సగటున 18 డిజిటల్ ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. పెద్ద రాష్ట్రాల సగటు 4.8 లావాదేవీలు మాత్రమే ఉండగా, ఏపీ దానికంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ డిజిటల్ వినియోగాన్ని నమోదు చేసింది. ఇది రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూచికగా నితి ఆయోగ్ పేర్కొంది.
ఏపి రోజుకు సగటున 23.71 గంటల విద్యుత్ సరఫరా అందిస్తోంది.
విద్యుత్ పంపిణీ నష్టాలను రాష్ట్రం 14 శాతం వద్ద నియంత్రిస్తోంది.
సముద్ర తీరం, భూసేకరణ అవకాశాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన బలాలుగా గుర్తించింది.
ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ, విధాన స్థిరత్వం, వేగవంతమైన భూ కేటాయింపులు వంటి అంశాలపై దృష్టి సారిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ రంగాల్లో పురోగతి సాధిస్తే భవిష్యత్తులో ఏపీ 'టాప్ పెర్ఫార్మర్' రాష్ట్రాల జాబితాలోకి చేరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Login
Comments (0)