ఏపీలో కాన్సర్ట్ టూరిజం విధానానికి ఆమోదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను కాన్సర్ట్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక విధానం 2024-29లో భాగంగా 'కాన్సర్ట్ ప్రమోషన్ ఫ్రేమ్‌వర్క్'కు గురువారం ఆమోదం తెలిపింది. సంగీత కచేరీలు, వినోద ఉత్సవాల ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విధానం ప్రకారం అమరావతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ప్రతి ఏడాది కనీసం నాలుగు అంతర్జాతీయ స్థాయి సంగీత ఉత్సవాలు, మరో ఐదు జాతీయ, అంతర్జాతీయ వినోద కార్యక్రమాలు నిర్వహించే ఈవెంట్ సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో ఈ మూడు నగరాల్లో 10 వేల నుంచి 50 వేల మంది వరకు సామర్థ్యం కలిగిన ప్రపంచస్థాయి కాన్సర్ట్ వేదికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో టికెట్ ఆధారంగా నిర్వహించే సంగీత కచేరీలు, ఇతర భారీ ఈవెంట్లకు లోటు భర్తీ నిధి (VGF) కింద ఒక్కో కార్యక్రమానికి గరిష్ఠంగా రూ.5 కోట్లు అందించనుంది. కార్యక్రమ ప్రాధాన్యం, ప్రేక్షకుల సంఖ్య ఆధారంగా ఈ ప్రోత్సాహకాన్ని రూ.10 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది.
ప్రేక్షకుల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు ఇలా ఉంటాయి:
- 20 వేల లోపు ప్రేక్షకులు: రూ.2 కోట్లు
- 20 వేల నుంచి 50 వేల మంది: రూ.3 కోట్లు
- 50 వేల మందికి పైగా: రూ.5 కోట్లు
ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.25 కోట్ల ప్రోత్సాహక నిధి కేటాయించనుంది.
భారీ ఈవెంట్ల నిర్వహణ కోసం ప్రభుత్వ మైదానాలు, బీచ్‌లు, బహిరంగ ప్రదేశాలను ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. పెద్ద కార్యక్రమాల సమయంలో హోటల్ గదుల కొరత లేకుండా ముందుగానే గదులను బ్లాక్ చేసుకునే సౌకర్యంతో పాటు, గది అద్దెల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురానుంది.
అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో వేగంగా మంజూరు చేయనున్నారు. ఈ విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ (APTA) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుండగా, పర్యాటక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ప్రోత్సాహకాలపై తుది నిర్ణయం తీసుకోనుంది.
Login
Comments (0)